- టీసాట్ వేదికగా నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఒప్పందం
- ఎంవోయూపై సంతకం చేసిన నవీన్ నికోలస్, వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల విద్యార్థుల తల్లిదండ్రులతో ఇక నుంచి టీసాట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించేలా స్కూల్ ఎడ్యుకేషన్, టీసాట్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టీసాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఎంవోయూపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఈ ఎంవోయూ ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, టీసాట్ మధ్య మరింత స్పష్టత వస్తుందన్నారు. తొమ్మిది, పదో తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలు ప్రసారం చేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సీఎం ‘ముఖాముఖి’, ‘మా జిల్లా - మా పాఠశాల’ పేరుతో డీఈవోలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. ఉపాధ్యాయుల కోసం ‘టీఎల్ఎం మేళా’ వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఇక నుంచి టీసాట్లో ప్రసారం చేస్తామన్నారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్స్‌ను క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టీసాట్ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్ఈఆర్టీ తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
